*ఫుల్ కిక్కే కిక్కు.. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు*
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ ఒకటవ తేదీల్లో మందు బాబులు భారీగా మద్యం కొనుగోలు చేశారు. ఈ రెండు రోజుల్లో దాదాపు రూ.419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న రూ.333 కోట్ల మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అక్టోబర్ ఒకటో తేదీన రూ.86 కోట్ల మద్యం సేల్స్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి.
అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం అమ్మకాలతోపాటు మాంసం దుకాణాలు కూడా బంద్ అయ్యాయి. దీని ఎఫెక్ట్ దసరా పండుగపై పడింది. అక్టోబర్ 2న గాంధీ జయంతితోపాటు దసరా పండుగ కూడా వచ్చింది. ఆ రోజు మద్యం షాపులు బంద్ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 1వ తేదీనే వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. వైన్ షాపులు, లిక్కర్ మార్ట్ ముందు మందుబాబులు క్యూ కట్టిన పరిస్థితి. ఈ క్రమంలో దసరా, అక్టోబర్ 2 ఒకేరోజు వచ్చినప్పటికీ అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగాయిని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది..