నిర్మల్ జిల్లా సారంగాపూర్‌లో పంట కొనుగోలులో జాప్యంపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తితే ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.
మండలంలోని మార్కెట్ యార్డ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, పేరుకుపోయిన మొక్కజొన్న రాశులను చూసి అధికారులను నిలదీశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని, మొక్కజొన్న కొనుగోలు ఆలస్యం కావడం, వరి కోతలు దగ్గరపడటం, అకాల వర్షాల భయం వారిని ఆందోళనకు గురిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెంటనే గన్ని బ్యాగులు, రవాణా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.












