ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, చేతికి వచ్చిన ధాన్యాన్ని మధ్యవర్తులకు అమ్మి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మక్కజొన్న పంట చేతికి వచ్చిన ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలు లేకపోవడం దళారులకు వరంగా మారిందని రైతులు వాపోతున్నారు.
కుబీర్ మండల వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 15 వేల ఎకరాలలో మొక్కజొన్న పంట సాగైందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికి వస్తున్నప్పటికీ, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.1700 చొప్పున అమ్ముకోవాల్సి వస్తోందని, దీనివల్ల క్వింటాల్‌కు రూ.700 నుండి రూ.800 వరకు నష్టపోతున్నారని రైతులు తెలిపారు.
ప్రతి సంవత్సరం తమ పంటలను ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించిన తర్వాతే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల శనగ కొనుగోలు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే రామారావు పటేల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేదని వారు వాపోయారు. మరోవైపు, అకాల వర్షాలు కూడా రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు దళారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట చేతికి రావడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఎక్కడపడితే అక్కడ కాంటాలు ఏర్పాటు చేసుకొని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ట్రేడింగ్ లైసెన్సులు లేకుండానే కొనుగోళ్లు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైతుల సమస్యలను ఆసరాగా చేసుకుని దళారులు రెచ్చిపోతున్నారని, మార్కెట్ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ మార్కెట్ సెక్రెటరీ లేకపోవడం దళారులకు మరింత కలిసివస్తోందని, అడిగేవారు లేకపోవడంతో వారి దందాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, అధికారులకు తెలిసి జరుగుతోందా లేక తెలియక జరుగుతోందా అని పలువురు మండిపడుతున్నారు. ప్రైవేట్ కొనుగోళ్లపై మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉన్నా, ఇప్పటివరకు చెల్లించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దళారీ వ్యవస్థను అరికట్టి, మార్కెట్ ఫీజు వసూలు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.












