కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
మంగళవారం దిలావర్ పూర్ మండల కేంద్రంలోని మొక్కజొన్న, వరి కల్లాలను ఆయన పరిశీలించి, మార్కెట్ యార్డులో కుప్పలుగా పడి ఉన్న మొక్కజొన్నను చూసి అధికారులను నిలదీశారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మొక్కజొన్న పంట పూర్తి స్థాయిలో కొనుగోలు కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని, మరోవైపు వరి ధాన్యం కోతకు వచ్చి కల్లాలకు వస్తున్నాయని, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వం వెంటనే రైతులకు గోనె సంచులు, రవాణా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే, పెద్ద ఎత్తున రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు నర్సారెడ్డి, నాయకులు మంద మల్లేష్, వీరేష్, శైలేశ్వర్, విక్రమ్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












