మిర్యాలగూడ, 2026-08-14
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాల్వకు వానాకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాల్వకు వానాకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి అన్ని డ్యాంలు నిండుగా ఉన్నాయని, శ్రీశైలం ప్రాజెక్టులో 872 అడుగుల నీరు ఉందని, మరో 7 అడుగులు అయితే ప్రాజెక్టు నిండుతుందని తెలిపారు. ఈ దశలో అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి సాగర్ ప్రాజెక్టుకు వదిలినట్లయితే ఆ నీటితో ఎడమ కాల్వకు రెండు పంటలకు నీటి విడుదల చేయవచ్చన్నారు. అదే విధంగా తాగునీటికి కూడా కొరత ఉండదని ఆయన పేర్కొన్నారు.
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిపై విమర్శలు
నీటి పారుదల శాఖ మంత్రి, జిల్లాకు చెందిన ఉత్తంకుమార్ రెడ్డి ఉన్నా కూడా నీటి విడుదలపై నోరు మెదపడం లేదని భాస్కర్‌రావు విమర్శించారు. అదే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, భట్టి విక్రమార్క, నల్లగొండ జిల్లా ఆయకట్టులో ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బీఎల్ఆర్, పద్మావతి ఉన్నారని, సాగునీటిపై వీరు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేకుండాపోయిందని ఆయన అన్నారు.
శ్రీశైలం నీటి తరలింపుపై ఆరోపణలు
శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేశారని, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ దశలోనే కేవలం విద్యుత్ తయారీ, నీటి నిల్వ కోసమే ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారన్నారు.
ప్రభుత్వానికి హెచ్చరిక
అక్రమ నీటి తరలింపుపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సోయి లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీటి విడుదల విషయంలో నిర్లక్ష్యం చేస్తే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి విడుదలపై సలహాలు స్వీకరించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఛలో సాగర్ కార్యక్రమం
నీటి విడుదల చేయనట్లయితే రైతులతో కలిసి ఛలో సాగర్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్, హాతీరాం, అన్నభీమోజు నాగార్జునచారి, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పడిగపాటి కోటిరెడ్డి, ఎండి. యూసుఫ్, వాచ్నాయక్, వినోద్, రవీందర్, షోయబ్, పద్మావతి, రమాదేవి పాల్గొన్నారు.












