ఖానాపూర్, ఆగస్టు 4
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో తగినంత వర్షాలు కురవక, విత్తిన పంటలు మొలకెత్తక నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రైతు సమస్యలపై తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచి వర్షాలు కురుస్తాయనే ఆశతో మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పత్తి తదితర పంటల విత్తనాలు విత్తారని, అయితే వర్షాభావం కారణంగా అవి మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. మొలకెత్తని పంటలను అధికారులు వెంటనే సర్వే చేసి, నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని కోరారు.
పంటల బీమా అమలు కాకపోవడంతో ప్రతి ఏడాది రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులకు భరోసా కల్పించేలా పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, దశాబ్దాలుగా పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులు ట్రాక్టర్లు, డోజర్లు వినియోగించరాదంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరించడం సరికాదన్నారు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని పోడు సాగుకు ట్రాక్టర్ల వినియోగానికి అనుమతి ఇవ్వాలని, రైతులను బెదిరించే చర్యలను వెంటనే నిలిపివేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం చేపట్టిన ఆందోళనలో భాగంగానే ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు అడ్డగట్ల కంతార్, ఇనే లభ్ను, అందాల శంకర్, జక్కుల రాజన్నతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు.