ముధోల్ నియోజకవర్గంలోని ఐదు చెరువుల మరమ్మత్తుల కోసం రూ. కోటి 50 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. ఈ నిధుల ద్వారా రైతులకు సాగునీటి లభ్యత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
మంజూరైన నిధులను వివిధ చెరువుల మరమ్మత్తులకు కేటాయించారు. కుంటాల మండలంలోని దౌనెల్లి చెరువుకు రూ. 34.50 లక్షలు, అందాకూర్లోని పెద్ద చెరువుకు రూ. 22.20 లక్షలు, పెంచికల్ పాడ్ గ్రామంలోని గోధుమ కుంట చెరువుకు రూ. 22.15 లక్షలు, కల్లూరు గ్రామంలోని పెద్ద చెరువుకు రూ. 33.60 లక్షలు, కుభీర్ మండలంలోని హంపొలి చెరువుకు రూ. 39.50 లక్షలు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
త్వరలోనే టెండర్ ప్రక్రియను ప్రారంభించి, మరమ్మత్తు పనులు మొదలుపెడతామని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ చెప్పారు. రైతులకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని, ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకరించారని ఆయన పేర్కొన్నారు.
గత రెండేళ్లుగా సాగునీటి రంగానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించామని, అనేక పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. సాగునీటి రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి, రైతులకు నీటి సమస్య లేకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.


