ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (N-NMF) కింద ఎంపికైన ఐకేపీ మహిళలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రసాయనాలతో సాగు కంటే సేంద్రియ పద్ధతులు పాటించడం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయని తెలిపారు. ఆర్గానిక్ పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని చెప్పారు.
జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతం చేయడానికి 15 క్లస్టర్లను ఎంపిక చేసి, ప్రతి క్లస్టర్ నుంచి ఇద్దరు ఐకేపీ మహిళలను ‘కృషి సఖి’లుగా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ అందించినట్లు కలెక్టర్ వివరించారు. శిక్షణ పొందిన మహిళలు గ్రామాల్లో రైతులకు సేంద్రియ సాగు విధానాలపై అవగాహన కల్పించి, ప్రకృతి వ్యవసాయం వైపు వారిని ప్రోత్సహించాలని సూచించారు.
అలాగే, జిల్లా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేందుకు ప్రత్యేక షాప్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను సంస్థ ప్రతినిధులు కలెక్టర్కు అందజేశారు.
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ‘కృషి సఖి’ మహిళలకు కలెక్టర్ ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, అరణ్య సంస్థ ప్రతినిధులు, జిల్లా వ్యవసాయ అధికారి, ఉద్యానవన శాఖ అధికారి, అధికారులు, సిబ్బంది, ఐకేపీ మహిళలు పాల్గొన్నారు.


