రానున్న పంట కాలానికి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన వ్యవసాయ టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
జిల్లాలోని రైతులకు అన్ని రకాల పంటలకు నాణ్యమైన విత్తనాలను అందించాలని కలెక్టర్ సూచించారు. విత్తన దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, విత్తనాల నాణ్యతను పరిశీలించాలని, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా చూడాలని స్పష్టం చేశారు.
పంట సాగు కాలానికి అవసరమైన యూరియాను రైతులకు సకాలంలో అందించాలని, యూరియా బుకింగ్ యాప్ ద్వారా సరఫరా చేయాలని సూచించారు. వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను మళ్లించకుండా అరికట్టాలని, సహజ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.











