మొక్కజొన్న, వరి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ ధాన్యం గోదాములకు తరలింపు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని, అవసరానికి అనుగుణంగా మరిన్ని లారీలను సమకూర్చుకోవాలని సూచించారు. లారీలు సమకూర్చే ప్రాంతాలు, అన్లోడింగ్ కేంద్రాల వద్ద రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సిబ్బందిని షిఫ్ట్‌ల వారీగా నియమించాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సంచులు నిల్వ ఉండకుండా చూడాలని, అవసరమైతే స్థానిక కూలీలను హమాలీలుగా నియమించుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో అన్లోడింగ్ పాయింట్లు ఉన్న కేంద్రాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ గోదాములతో పాటు ప్రైవేట్ గోదాములు, రైతు వేదికల్లోనూ ధాన్యం నిల్వకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ధాన్యం తరలింపు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేందుకు పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. చెక్‌పోస్టులు, టోల్‌ప్లాజాలు, ఇతర తనిఖీ కేంద్రాల్లో తగిన పోలీసు సిబ్బందిని నియమిస్తామని ఆమె చెప్పారు.
రైతుల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కూడా హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, డీఎస్పీ శ్రీనివాస్, పౌర సరఫరాల అధికారులు, మార్క్‌ఫెడ్, డీఆర్డీఓ, వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.











