- ప్రభుత్వ సంక్షేమ పథకాల కుదింపు కోసం రేషన్ కార్డుల మంజూరులో జాప్యం
- నూతనంగా పెళ్లైన వారు, వలస వెళ్లిన వారు ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు
- ప్రభుత్వంపై అభిష్టం మేరకు పరిపాలన సాగించాలని డిమాండ్
బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ అడ్వకేట్ జగన్ మోహన్, ప్రభుత్వ సంక్షేమ పథకాల కుదింపు కోసం రేషన్ కార్డుల మంజూరులో జాప్యం అవుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రేస్ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపిస్తూ, వెంటనే రేషన్ కార్డుల నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.
బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇంచార్జీ అడ్వకేట్ జగన్ మోహన్, నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డుల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కొత్తగా పెళ్లైన వారు, వలస వెళ్లిన వారు, మరియు అద్దె ఇళ్లలో నివసించే అనేక మంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.
రేషన్ కార్డుల గడువు జాప్యం ప్రభుత్వ సంక్షేమ పథకాల కుదింపు కోసం అవుతుందన్న ఆరోపణ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే కమిటీలు, ఉపసంఘాలు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు నిజమైన సంక్షేమాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, తక్షణమే రేషన్ కార్డుల నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.
గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం కూడా రేషన్ కార్డుల మంజూరులో కాలయాపన చేసి ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొనడం గమనించామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోందని విమర్శించారు. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు పరిపాలన సాగించాలని, అవసరమైతే ప్రజల సమస్యల కోసం పోరాడతామని జగన్ మోహన్ తెలిపారు.