వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన త్రయాహ్నిక మహోత్సవం
ఆధ్యాత్మిక చింతనతో మారుమ్రోగిన సారంగాపూర్ –
ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించిన మహోత్సవం
మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్ ప్రతినిధి, నవంబర్ 13:
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో ఆధ్యాత్మిక వైభవం నిండిన ఘట్టం చోటు చేసుకుంది. గౌడ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన త్రయాహ్నిక మహోత్సవం భక్తి స్ఫూర్తిని నింపింది. హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విద్యారణ్య భారతీ స్వామీజీ, శ్రీ గురుముల చంద్రశేఖర్ వర్మ (పంతులు) ఆధ్వర్యంలో, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారి ప్రతిష్ఠాపన ఘనంగా సాగింది. ఆలయ ప్రాంగణం వేదఘోషాలతో మారుమ్రోగింది. స్వామీజీ ఆధ్యాత్మిక ప్రవచనం వినేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తి, శ్రద్ధలతో నిండిన ఈ వేడుకలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు కోరిపల్లి రామ్‌కిషన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర గౌడ్ సంఘం అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, మాజీ ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, దశరథ్ రాజేశ్వర్, ఐర నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ, “ఈ మహోత్సవం భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి భక్తుని జీవితం శుభముగా, సాఫల్యముగా సాగాలని కోరుకుంటున్నాం” అన్నారు. అమ్మవారి ప్రతిష్ఠాపన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. సారంగాపూర్ అంతటా ఆధ్యాత్మిక వాతావరణం, భక్తి స్పూర్తి పరచుకుంది. ఈ వేడుకలు రేణుక ఎల్లమ్మ భక్తులకు చిరస్మరణీయంగా నిలిచాయి.