కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచులకు ఘన సన్మానం
రత్న గార్డెన్‌లో జిల్లా స్థాయి కార్యక్రమం
గ్రామ పాలన ప్రజలకు చేరువ కావాలంటే సర్పంచులే కీలక పాత్ర పోషించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గ్రామీణ ప్రజల పక్షానే నిలుస్తుంది : టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
మనోరంజని తెలుగు టైమ్స్ | ఆదిలాబాద్ | డిసెంబర్ 27
ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని రత్న గార్డెన్‌లో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరుకాగా, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఆత్రం సుగుణక్క ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ,
గ్రామ పాలన ప్రజలకు మరింత చేరువ కావాలంటే సర్పంచులే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తుందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించాలని సర్పంచులకు సూచించారు.
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ,
గ్రామాభివృద్ధి సర్పంచుల చేతుల్లోనే ఉందని, ప్రజలతో సమన్వయం పెంచుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సక్రమంగా అమలు చేస్తే గ్రామాలు మరింత ప్రగతి సాధిస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గ్రామీణ ప్రజల పక్షానే నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.