*_తొలి దశ పంచాయతీ పోరుకు..ఇవాళ్టి(నవంబర్ 27)నుంచి నామినేషన్లు_*

*_తొలి దశ పంచాయతీ పోరుకు..ఇవాళ్టి(నవంబర్ 27)నుంచి నామినేషన్లు_*

_మూడు రోజుల పాటు స్వీకరణ.. డిసెంబర్ 11న పోలింగ్_
_మూడు, నాలుగు గ్రామాలకో క్లస్టర్.._ _అందులోనే నామినేషన్ల దాఖలు_
_ఈ నెల 30న స్క్రూటినీ.. డిసెంబర్ 3 వరకు విత్డ్రాకు చాన్స్_

_తొలి విడతలో 4,236 సర్పంచ్,_ _37,440 వార్డు స్థానాలకు ఎలక్షన్స్_
_ఆర్వో, ఏఆర్వోలుగా గెజిటెడ్ ఆఫీసర్లకు బాధ్యతలు_
_హైదరాబాద్ : పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. తొలి విడత ఎలక్షన్స్ కోసం గురువారం నుంచి నామినేషన్లు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో కాకుండా మూడు, నాలుగు గ్రామాలను కలిపి ఒక ‘క్లస్టర్’గా ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేవారు ఆయా క్లస్టర్ కేంద్రాల్లో తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. కేంద్రాల్లో పంచాయతీల వారీగా నామినేషన్ల కోసం కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా (ఏఆర్వోలు) గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను నియమించారు. వీరు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. క్యాష్ డిపాజిట్కూడా వీరికే చెల్లించాల్సి ఉంటుంది._

_మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. గురువారం నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. శనివారం వరకు (మూడు రోజులు) నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్ని నామిషన్లు తిరస్కరించారు? ఎన్ని నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.. అనేది అదే రోజు తేలుతుంది. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్పీల్ పరిష్కరిస్తారు. డిసెంబర్ 3న మధ్యాహ్నం3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు మధ్యాహ్యం 3 గంటల తర్వాత బరిలోని అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత స్థానాలకు డిసెంబర్ 11న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడ్తారు. మొత్తం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండో విడత ఎన్నికలకు నామినేషన్లను ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు స్వీకరిస్తారు. ఈ దశలో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 14న పోలింగ్, కౌంటింగ్ ఉంటుంది. మూడో దశ ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి 6 వరకు నామినేషన్లు తీసుకుంటారు. ఈ ఫేజ్లో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్ 17న పోలింగ్, కౌంటింగ్ ఉంటుంది. మొత్తంగా మూడు దశల్లో కలిపి 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి._

*_4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చు.._*

_నామినేషన్‌ వేసేరోజే ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోయినా నామినేషన్‌ తీసుకుంటారు. కానీ, చెక్‌ లిస్టులో ఎలాంటి పత్రాలు సమర్పించలేదని నమోదు చేయాలి. డాక్యుమెంట్లు నామినేషన్ల చివరి తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. ఆ తర్వాత ఇచ్చినా స్వీకరించరు. నామినేషన్‌ తిరస్కరణ అనేది పరిశీలనలో నిర్ణయిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాదకుడు నామినేషన్‌ పత్రాలపై సంతకం పెట్టకుంటే అఫిడవిట్‌ సమర్పించాలి. ప్రతిపాదకుడి సంతకం ఫోర్జరీ అని తేలితే దాన్ని రిటర్నింగ్‌ అధికారి పరిశీలించి విచారణ తర్వాత నిర్ధారించి ఆ నామినేషన్ను తిరస్కరించవచ్చు. ఒక వ్యక్తి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గరిష్టంగా నాలుగు నామినేషన్లను వేయొచ్చు. ఒక వ్యక్తి ఎక్కువ నామినేషన్లను వేసినా.. చెల్లుబాటు జాబితాలో ఆయన పేరు ఒక్కసారి మాత్రమే రాస్తారు. తన నామినేషన్‌ ఉపసంహరణకు చెల్లుబాటు జాబితా ప్రకటించే వరకు వేచిచూసి ఉపసంహరించుకోవాలి. నామినేషన్‌ వేయడానికి పోటీ చేసే వ్యక్తి, ప్రతిపాదకుడితోపాటు మరో ముగ్గురిని రిటర్నింగ్‌ అధికారి తన రూమ్లోకి అనుమతిస్తారు. నామినేషన్‌లో పోటీ చేసే వ్యక్తి సంతకం మర్చిపోతే దానిని తిరస్కరించవచ్చు. ఒక్కసారి నామినేషన్‌ వేసిన తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదు. నామినేషన్‌ ఉపంసహరణ నోటీసుపై స్వయంగా సంతకం చేసి నమూనాలో సమయంలోపు రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాలి. అలా ఇవ్వలేని సమయంలో రాతపూర్వకంగా అధికారం ఉన్న ప్రతిపాదకుడు ఎన్నికల ఏజెంట్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారికి సమర్పించవచ్చు. ఒక్కసారి నామినేషన్‌ ఉపంసహరణ గడువు ముగిసిన తర్వాత దానిని రద్దు చేసుకోవడానికి వీలు లేదు. రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ తిరస్కరిస్తే దానికి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం మరుసటిరోజు కలెక్టర్, సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోకు అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్‌ చేయవచ్చు. పోటీ చేస్తున్న వ్యక్తిపై నేరారోపణపై శిక్షపడి దోషిగా నిర్ధారిస్తే పోటీ చేయడానికి అనర్హులవుతారు._

*_నామినేషన్ పత్రానికి డిపాజిట్ రసీదు_*

_నామినేషన్లను స్వీకరించేందుకు గెజిటెడ్ హోదా ఉన్న అధికారులను ఆర్వోలు, ఏఆర్వోలుగా నియమించారు. నామినేషన్ పత్రంతోపాటు ఫొటో, క్యాస్ట్, నో డ్యూస్, బర్త్ సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్ను పోటీ చేసేవాళ్లు జత చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్లో పోటీ చేసే వ్యక్తి, ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి. నామినేషన్తోపాటే డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్‌ పదవికి పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యక్తులు రూ.వెయ్యి, ఇతరులు రూ.2 వేలు డిపాజిట్ చేయాలి. వార్డు మెంబర్కు పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యక్తులు నామినేషన్‌ రుసుం కింద రూ. 250, ఇతరులు రూ.500 చెల్లించాలి. డిపాజిట్ క్యాష్ రూపంలో ఆర్వోకు చెల్లిస్తే రసీదు ఇస్తారు. ఆ రసీదును నామినేషన్ పత్రానికి జోడించాలి. లేదంటే ఆ నామినేషన్ పరిగణనలోకి తీసుకోరు. డిపాజిట్ రూపంలో వచ్చిన నగదును మండలం వారీగా ఎన్నికల అధికారికి అప్పగిస్తారు. వచ్చిన నగదును ‘మండల జనరల్ ఫండ్ (ఎంజీఎఫ్)’ కింద జమ చేస్తారు. ఎన్నికల్లో గెలుపొందిన, డిపాజిట్ అర్హత పొందిన అభ్యర్థులకు తిరిగి చెల్లిస్తారు. డిపాజిట్ కోల్పోయినవారి డబ్బులను ఎంజీఎఫ్లోనే జమవుతాయి. ఈ నిధులను తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులకు వాడుతారు._

*_పకడ్బందీగా ఎన్నికలు: ఎస్ఈసీ_*

_ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ సాగేలా, గ్రౌండ్ లెవల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బుధవారం పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ సృజన, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్తో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ, బందోబస్తుపై దిశానిర్దేశం చేశారు. మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై ఆరా తీశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చూడాలని పోలీసు అధికారులకు రాణి కుముదిని సూచించారు. అన్ని దశల ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. పోలింగ్ సిబ్బంది నియామకం, వారికి ట్రైనింగ్ పూర్తిచేయాలన్నారు._

Join WhatsApp

Join Now

Leave a Comment