*_Exams | కొత్త పద్ధతిలో టెన్త్ పరీక్షలు_*
_Exams | కొత్త పద్ధతిలో టెన్త్ పరీక్షలు_
_ప్రతి పరీక్షకు రెండు రోజుల గ్యాప్_
_విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేలా చర్యలు_
_మార్చి 18 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు_
_సీబీఎస్‌ఈ తరహాలో టైం టేబుల్ రూపొందించే పనిలో అధికారులు_
_హైదరాబాద్ : తెలంగాణాలో ఈ విద్యా సంవత్సరం పదవతరగతి పరీక్షలను గతానికి భిన్నంగా_ _నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ ప్రతిపాదించింది. పదవతరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 18 నుంచి ప్రారంభిస్తుండగా ఈ దఫా ఒక్కో పరీక్ష మధ్య ఒకటిరెండు రోజుల వ్యవధి ఇవ్వాలన్న ఆలోచనలో విద్యా శాఖ ఉన్నట్టు తెలిసింది._
_ఈ ప్రతిపాదనలో భాగంగా పాఠ శాల విద్యాశాఖ రెండు మూడు రకాల షెడ్యూళ్లను రూపొం దించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. ఇందువల్ల పదవ తరగతి పరీక్షల తేదీల ప్రకటనలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక పరీక్షకు మరో పరీక్షకు నడుమ రెండు, మూడు రోజుల పాటు వ్యవధి ఇస్తే విద్యార్థులు పరీక్షలకు ఉత్తమంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుందని తద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్న భావనతో అధికారులు ఉన్నట్టు సమాచారం._
_పరీక్షలను వరుసగా నిర్వహించడం వల్ల బాగా చదివే విద్యార్థులు సైతం ఫలితాల్లో వెనుకబడి పోతున్నారని, ఇక అంతంతమాత్రం చదివే విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు.అందుకే ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా ఒక పరీక్షకు మరో పరీక్షకు నడుమ కనీసం రెండు రోజుల వ్యవధి ఉండేలా పరీక్షల టైం టేబుల్ రూపొందించి ప్రభుత్వ అనుమతి పొందాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది._
*_సీబీఎస్‌ఈ పరీక్షల తరహాలోనే…._*
_సీబీఎస్‌ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిర్వహిస్తున్న కొన్ని పరీక్షలకు వారం రోజుల వ్యవధి కూడా ఉంటోంది. అదే విధానాన్ని తెలంగాణలో పదో తరగతికి అమలు చేస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గత విద్యా సంవత్సరం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో కొన్ని ఎగ్జామ్స్‌మధ్య ఒక రోజు కూడా వ్యవధి లేదని ,పరీక్షల మధ్య వ్యవధి ఉండాలని దీని వల్ల విద్యార్థులు మానసిక ఇబ్బంది,ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉండదని విద్యావేత్తలు సూచిస్తున్నారు._
_ఒక పరీక్ష కు మరో పరీక్షకు. మధ్య ఒకటి,రెండు రోజుల వ్యవధి ఉండ టం వల్ల విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకుంటారని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీబీఎస్‌ఈ పది, 12 తరగతులకు ఒకేసారి పరీక్షలను నిర్వహిస్తుంది. దానికితోడు ఆప్షనల్ సబ్జెక్టులు కూడా అనేకం ఉండటం వల్ల ఒక్కో పరీక్ష మధ్య కనీసం రెండు నుంచి ఏడు రోజుల వ్యవధి ఉంటోంది. సీబీఎస్‌ఈ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను సెప్టెంబరు 24వ తేదీన విడుదల చేసింది. పదో తరగతి పరీక్షల తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది._