*_BC Reservations: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం..!!_*
_హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 9 అమలుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది._
_తాజాగా హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల కాగా.. దానిని అధ్యయనం చేసిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది._
_స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరాలని, ఈ మేరకు సీనియర్ కౌన్సిల్‌తో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. దీంతో సోమవారం పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ సందర్భంగా.. బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది._
_ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్‌లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్‌ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.._
_రిజర్వేషన్‌ల జీవో 9ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బీ మాధవరెడ్డి, మరొకరు.. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్‌లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు._