*_నెలాఖరులో ‘స్థానిక’ నగారా_*
– సన్నద్ధంగా ఉండాలని క్యాడర్‌కు టీపీసీసీ ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలాఖరులో నగారా మోగే అవకాశాలున్నాయి. ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేయాలని టీపీసీసీ నుంచి ఎమ్మెల్యేలు, నాయకులకు ఆదేశాలు అందినట్లు సమాచారం, రాజకీయాల్లో, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై చేసిన బిల్లులు, ఆర్డినెన్స్‌లు ఆమోదం కోసం రాష్ట్రపతి చెంతకు చేరాయి.
వాటిని ఆమో దించేలా ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సహ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఢిల్లీలోనే ఉన్నారు. జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ధర్నా చేశారు. పార్లమెంట్లో చర్చకు వాయిదా తీర్మానాలు ఇస్తే ప్రభుత్వం తోసి పుచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన మేరకు గడువు ముంచుకు వస్తున్నది. ఆ గడువులోగానే ఎన్నికలు నిర్వహించేం దుకు ముందుకు పోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఓవైపు..42 శాతం బీసీ రిజర్వేషన్లపపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే, మరోవైపు ఎన్నికల నిర్వహణకు అధికార పార్టీ సన్నద్ధం అవుతున్నది. రాజకీయాల వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో, మంత్రులతో చర్చించిన తర్వాత ఎన్నికలపై ముందుకు సాగుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన మేరకు రెండు, మూడు రోజుల్లో సమావేశాలు నిర్వహిం చేందుకు సన్నద్ధం అవుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల విషయమై ప్రభుత్వం మూడు మార్గాలను అన్వేషిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో తీసుక వచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న 50 శాతం రిజర్వేషన్ల నిబంధనను పక్కనబెట్టి జీఓ తీసుకరావడం, ఎన్నికలు నిర్వహించకుండా నిలువరించడం, పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయించే మార్గాలను అన్వేషిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పటికే ఆలస్యమయ్యింది. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంగా మండల, జిల్లా పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, ఆరు మాసాలుగా మున్సి పాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఎన్నికల నిర్వహణలో జాప్యంపై ప్రభుత్వంపై రాజకీయ పక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
*_పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించే యోచన_*
రిజర్వేషన్లపై జీఓ తీసుక వస్తే ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశాలు న్నాయి. చివరగా పార్టీ పరంగా 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించి ముందుకు పోవాలని భావిస్తున్నారు. మొదట జీఓ జారీ చేసి, దాని పర్యావసానాన్ని గమనిం చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో ఈ నెలాఖరు వరకు గ్రామ పంచాయతీ లేదా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏదో ఒక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతానికి మించకుండానే జనాభా, ఓటర్ల ప్రాతిపదికన స్థానాలను రిజర్వు చేయనున్నారు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ స్థానాలకు రొటేషన్ ప్రకారమే రిజర్వు చేయనున్నారు. 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం లభించకుంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైఖరిని ఎండగట్టాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో చేసిన 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకపోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 20 నెలల కాలంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురించి విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేసిన కులగణన సర్వే, అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ కోసం తీసుక వచ్చిన ఆర్డినెన్స్‌ల గురించి ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు నగారా మోగే అవకాశాలున్నాయని, స్థానిక ఎన్నికలకు పార్టీ క్యాడర్ సన్నద్ధంగా ఉండాలని టీపీసీసీ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తున్నది. పెద్దపల్లి జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు, 13 మం డల, జిల్లా పరిషత్ స్థానాలను, 137 ఎంపీటీసీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది.