ముధోల్ లో కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్న గ్రూపు రాజకీయాలు

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విబేధాలు
*ముధోల్ కాంగ్రెస్ లో కాక రేపుతున్న గ్రూపు రాజకీయాలు…* – కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వర్గీయులపై బగ్గుమంటున్న పాత క్యాడర్ – చిచ్చు పెడుతున్న ఇందిరమ్మ కమిటీలు – పెత్తనం కోసం పాకులాడుతున్న విట్టల్ రెడ్డి వర్గం, సోషల్ మీడియా వేదికగా సవాళ్లు – జీర్ణించుకోలేకపోతున్న నారాయణ పటేల్ వర్గం – గతంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని పార్టీలో చేర్చుకోవటంతో మొదలైన వర్గ పోరు – గోడ మీద పిల్లిలా విట్టల్ రెడ్డి వ్యవహార శైలి ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 14 నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు కాక రేపుతుంది. గతంలో పార్టీ కి వెన్నుపోటు పొడిచిన వారిని మళ్ళీ పార్టీ లో చేర్చుకోవటంతో వర్గ పోరు మొదలైంది. కొత్తగా పార్టీలో చేరిన ఆ మాజీ ఎమ్మెల్యే పై పాత కాంగ్రెస్ క్యాడర్ ఎందుకంత బగ్గుమంటుందో తెలుసుకుందాం…రాష్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న విట్టల్ రెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించారు. పార్టీ టికెట్ కేటాయించక పోవటంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరుపున పోటీ చేసి 183 ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేణుగోపాల చారి చేతిలో ఓటమి చెందారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావటం తో తిరిగి వెంటనే కాంగ్రెస్లో చేరి మళ్ళీ మార్కెట్ కమిటీ పదవి చేపట్టారు. ఇక తెలంగాణ ఏర్పడిన అనంతరం నిర్వహించిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి గా విట్టల్ రెడ్డి నిలిచారు. అయితే అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి రావటంతో విట్టల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్లో చేరారు. ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మళ్ళీ విజయం సాధించారు. ఇలా పదేండ్ల పాటు అధికార ధర్పం అనుభవించినా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్ ) నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ చేతిలో ఘోరంగా ఓటమి చెందారు. ఇదే సమయంలో రాష్టంలో బారాసా అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో బారాసా పార్టీలోని ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకులంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం మొదలయింది. రోజు రోజుకు తన క్యాడర్ ను కోల్పోతున్న తరుణంలో చేసేది ఏమీ లేక విట్టల్ రెడ్డి సైతం లోకసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా విట్టల్ రెడ్డి గోడ మీద పిల్లిలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి రాజకీయాలు చేస్తుండటంతో కష్ట కాలంలో పార్టీనే అంటి పెట్టుకుని ఉన్న నాయకులకు మింగుడు పడటం లేదనేది జగమెరిగిన సత్యం. నియోజక వర్గంలో ఈ కొత్త ఒరవడికి విట్టల్ రెడ్డి తెర లేపారు అనటంలో సందేహం లేదు. *గుర్రుగా నారాయణ రావు పటేల్ వర్గం* ఇక అప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న నియోజకవర్గ ఇంచార్జి నారాయణ రావు పటేల్ తో పాటు ఆయన వర్గీయలు కాంగ్రెస్ లో విట్టల్ రెడ్డి చేరికతో అసహనానికి లోనయ్యారు. గుర్రుగా ఉన్న పటేల్ వర్గీయులను జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క చొరువ తీసుకొని సర్ది చెప్పటంతో విట్టల్ రెడ్డి చేరికను వ్యతిరేకించకుండా మౌనంగా ఉన్నారు. *చిచ్చు పెట్టిన ఇందిరమ్మ కమిటీలు* ఇటీవల ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలనీ నిర్ణంచటంతో నియోజక వర్గంలో ఒక్కసారిగా గ్రూపు రాజకీయాలు తెరలేచాయి. ఇందిరమ్మ కమిటీల్లో స్థానం కోసం మా వర్గం వారంటే మా వర్గం వారంటూ పోటీ నెలకొనటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. *పెత్తనం కోసం పాకులాట, సోషల్ మీడియాలో సవాళ్లు.* ఇక పార్టీలో చేరిన కొన్నాళ్ళు స్థబ్దుగా ఉన్న విట్టల్ రెడ్డి ఇప్పుడు పైరవీలు చేయటం మొదలు పెట్టటం ఆయన వర్గీయునిగా కొనసాగుతున్న లోకేశ్వరం మండలానికి చెందిన ఒక మాజీ ఎంపీటీసీ తన పెత్తనం కోసం వేరే గ్రామానికి చెందిన ఇందిరమ్మ కమిటీల విషయంలో జోక్యం చేసుకోవటంతో పటేల్ వర్గీయులు అగ్గి మీద గుగ్గిళం అవుతున్నారు. ఇలా కొత్తగా పార్టీలో చేరిన వారు పెత్తనం కోసం పాకులాడటంతో ముందు నుంచీ పార్టీలో ఉన్నవారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా ఒకరి పై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ గ్రూపు రాజకీయాలకు తెర లేపారు. ఇకనైనా అదిష్టానం కలగజేసుకొని ఈ గ్రూపు రాజకీయాలకు తెర దించుతుందో లేదో చూడాలి మరి.

 

Leave a Comment