నిర్మల్ జిల్లాలో ప్రజా పాలన వేదిక సభ
ముధోల్ నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన భోస్లె నారాయణ్ రావు పాటిల్
నిర్మల్, జనవరి 16 మనోరంజని తెలుగు టైమ్స్:
నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ప్రజా పాలన వేదిక సభలో ముధోల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్య సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు భోస్లె నారాయణ్ రావు పాటిల్ తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సౌకర్యాల లోపం, సాగునీటి అవసరాలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించినట్లు చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి త్వరితగతిన పరిష్కరించాలని ఆయన కోరారు.
సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశలవారీగా పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు భోస్లె నారాయణ్ రావు పాటిల్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.