లెప్రసీ సర్వే డబ్బులు విడుదల చేసిన తర్వాతే సర్వే : సిఐటియు డిమాండ్
మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్, డిసెంబర్ 27
ఆశా వర్కర్లకు మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులు విడుదల చేసిన తర్వాతే కొత్త సర్వే నిర్వహించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తో శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవో అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ, స్పష్టమైన హామీలు, పెండింగ్ బకాయిలు చెల్లించేవరకు లెప్రసీ సర్వే నిర్వహించబోమని ఆశా వర్కర్లు నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఆశా వర్కర్లకు కనీస వేతనం కూడా చెల్లించటం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం నిర్ణయించకపోవడం వల్ల, పెరిగిన పనిభారం, నిత్యావసర వస్తువుల ధరల భారంతో ఆశా వర్కర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఆశా వర్కర్లకు నెలకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అదనంగా చెల్లించాల్సిన డబ్బులను కూడా ప్రభుత్వం ఎగ్గొట్టాలని చూడటం అన్యాయమని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలక్షన్ డ్యూటీలు నిర్వహించిన ఆశా వర్కర్లకు పలుచోట్ల ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని తెలిపారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలోని వాగ్దానాలు, రాష్ట్ర ఆరోగ్య శాఖ 2024 ఫిబ్రవరి 9, 2025 సెప్టెంబర్ 1, జూలై 30, డిసెంబర్ 10 తేదీల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు పలు డిమాండ్లను వినతిపత్రంలో పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న లెప్రసీ సర్వే, పల్స్ పోలియో, స్థానిక ఎన్నికల ఎలక్షన్ డ్యూటీ బకాయిలను వెంటనే చెల్లించాలని, కేంద్రం పెంచిన పారితోషికాలను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పీఆర్సీ ఎరియర్స్ చెల్లించాలని కోరారు. ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు ప్రమోషన్, వెయిటేజీ మార్కులు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు, మట్టి ఖర్చులు రూ.50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు, టార్గెట్ల రద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు, పెన్షన్, వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి సెలవులు, నాణ్యమైన యూనిఫామ్, రెస్ట్ రూమ్ సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆశాలపై పనిభారం తగ్గించి, భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి. సుజాత, జిల్లా కార్యదర్శి పి. గంగామణి, జిల్లా ఉపాధ్యక్షులు విజయ, చంద్రకళ, సాయకర్ర ఇంద్రమాల, సరిత, సుగుణ, నంద, రామలక్ష్మి, కోశాధికారి లక్ష్మి, జిల్లా నాయకులు అనసూర్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు.