జర్నలిస్టుల అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధం :
దాదన్నగారి విఠల్ రావు
మనోరంజని తెలుగు టైమ్స్ హైదరాబాద్, డిసెంబర్ 27
హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద అక్రిడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు చేపట్టిన శాంతియుత ధర్నాను పోలీసులు అడ్డుకుని జర్నలిస్టులను అరెస్టు చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్ రావు ఖండించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించగా, ఈ విషయం పై విఠల్ రావు మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులపై జరిగిన అక్రమ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేసి, ప్రత్యేక నిధులు విడుదల చేసిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. జర్నలిస్టుల హక్కులు, భద్రతలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ నిలబడిందన్నారు. అక్రిడిటేషన్ కార్డుల సమస్యను వెంటనే పరిష్కరించి, జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని విఠల్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘాలు కూడా పోలీసుల చర్యలను ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశాయని ఆరోపించారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ బి.ఆర్.ఎస్ పార్టీ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.