కోటగిరి వైన్స్ ఎదుట మళ్లీ న్యూసెన్సు
తాగుబోతులకు అడ్డగా మారిన వైన్స్ షాపు
మనోరంజని తెలుగు టైమ్స్ కోటగిరి (నిజాంబాద్ జిల్లా) ప్రతినిధి
నిజాంబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో తాగుబోతుల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. మండల కేంద్రంలోని ఎత్తుండా గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న వైన్స్ షాపు తాగుబోతులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ షాపు ఎదుటే మద్యం సేవిస్తూ, మత్తులో పడిపోతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వైన్స్ షాపు పక్కనే ప్రధాన రహదారి ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు.
శుక్రవారం సాయంత్రం ఘటన
శుక్రవారం సాయంత్రం ఓ మద్యం ప్రియుడు అతిగా మద్యం సేవించి రోడ్డుపై పడిపోవడంతో కాలనీ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించిందని స్థానికులు పేర్కొన్నారు.
మహిళలు, విద్యార్థులకు ఇబ్బందులు
మద్యం సేవించిన వారు రహదారి పక్కనే, నివాస గృహాల సమీపంలో మూత్ర విసర్జన చేయడం వల్ల మహిళలు, విద్యార్థులు, విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినాయక్ నగర్ కాలనీ ప్రజలు ఈ సమస్యతో రోజూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పలుమార్లు వినతులు… ఫలితం శూన్యం
గతంలో కాలనీ ప్రజలు అనేకసార్లు ఉద్యమాలు నిర్వహించి, వినతిపత్రాలను కిందిస్థాయి అధికారుల నుంచి సెక్రటేరియట్ వరకూ, సంబంధిత శాఖ మంత్రికి కూడా అందజేసినా ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
రాజకీయ స్వార్థం కారణమా?
స్థానికంగా ఉన్న కొందరు రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసమే నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ షాపు కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఈ సమస్యలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
వైన్స్ షాపు వద్ద తాగుబోతుల న్యూసెన్సు అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వినాయక్ నగర్ కాలనీ ప్రజలు హెచ్చరిస్తున్నారు.