ఇలాగైతే ఎలా?
చందూరులో బీసీ వసతి గృహంలో ప్రమాదకర విద్యుత్ వైరింగ్
మనోరంజని తెలుగు టైమ్స్ చందూరు (నిజాంబాద్ జిల్లా) ప్రతినిధి
నిజాంబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వసతి గృహం నుంచి తీసుకెళ్లిన విద్యుత్ వైరు నేరుగా విద్యార్థులు ఉండే ప్రాంగణం మధ్యగానే పక్కనే కొనసాగుతున్న రేకుల షెడ్డూ నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటిప్పుడు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విద్యార్థుల మధ్యగా అస్తవ్యస్తంగా విద్యుత్ వైరు వెళ్లడం తీవ్ర ప్రమాదానికి దారితీయవచ్చని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
కరెంట్ బిల్లులు ఎవరు చెల్లిస్తారు?
వసతి గృహం విద్యుత్ కనెక్షన్‌ను నిర్మాణ పనులకు వినియోగించడం వల్ల కరెంట్ బిల్లులు అధికంగా వస్తే వాటిని ఎవరు చెల్లిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వసతి గృహాల నిధులు ఇలాంటి విధంగా వినియోగించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మౌలిక వసతుల లోపం
వసతి గృహంలో కిటికీలకు జాలీలు లేకపోవడం, ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడం, కొన్ని వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగానికి అనుకూలంగా లేకపోవడం, నేల గచ్చు సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. వార్డెన్ పర్యవేక్షణ లోపం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న హాస్టల్ వార్డెన్‌కు బోధన్ పట్టణంలో మరో వసతి గృహం కూడా ఇన్చార్జిగా ఉండటంతో, సరైన పర్యవేక్షణ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్యలు ఎప్పుడు?, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం ఎంతవరకు సమంజసమని, ప్రమాదం ఉన్న విద్యుత్ వైరింగ్‌ను వెంటనే తొలగించి, భద్రతా చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.