దారుణంగా మారిన నిజాంసాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల్
కిందిస్థాయి ఆయకట్టుకు అందని నీరు… రైతుల ఆవేదన
మనోరంజని తెలుగు టైమ్స్ రుద్రూరు (నిజాంబాద్ జిల్లా) ప్రతినిధి
నిజాంసాగర్ నీరు వదిలినా, చివరి ఆయకట్టు రైతులకు మాత్రం నీరు అందని ద్రాక్షగా మారింది.
నిజాంబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని రాయకూరు గ్రామంలో ఉన్న డి–28/5 నిజాంసాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల్ పరిస్థితి దారుణంగా తయారైంది.
కాలువలో చెత్తాచెదారం, ముళ్లపొదలు విపరీతంగా పేరుకుపోవడంతో నీరు సరిగా ప్రవహించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా కిందిస్థాయి రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టించుకోని అధికారులు, పాలకులు
ఈ సమస్యపై ఎన్నిసార్లు విన్నవించినా ఇరిగేషన్ అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనేక సంవత్సరాలుగా కాలువల మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులే స్వయంగా ఖర్చు చేసి కాలువలను శుభ్రం చేసుకునే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.
నీరు ఉన్నా ఉపయోగం లేదు
నిజాంసాగర్ నుంచి నీరు విడుదల చేస్తున్నప్పటికీ, కాలువల నిర్వహణ లోపాల కారణంగా చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదని రైతులు వాపోతున్నారు. కాలువల్లో చెత్తాచెదారం తొలగించకపోవడంతో నీరు అడ్డంకులకు గురై వృథాగా పోతోందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి
ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో అనేక చోట్ల డిస్ట్రిబ్యూట్ కెనాళ్లు, పిల్ల కాలువల పరిస్థితి ఇదే విధంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వల్లే కిందిస్థాయి రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణ చర్యలు చేపట్టాలి
కాలువల శుభ్రత, మరమ్మతులు వెంటనే చేపట్టి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
లేకపోతే పంటలు
ఎండిపోతాయని, ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.