బాసర గ్రామ పంచాయతీలో సమీక్షా సమావేశం — ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: తీగల వెంకటేష్ గౌడ్
మనోరంజని తెలుగు టైమ్స్, బాసర, డిసెంబర్ 26:
బాసర గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తీగల వెంకటేష్ గౌడ్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన పంచాయతీ సిబ్బందితో మాట్లాడుతూ, గ్రామంలోని త్రాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, వాటర్ ట్యాంకుల శుభ్రత, మురుగు కాలువల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని సిబ్బందిని ఆయన స్పష్టంగా ఆదేశించారు.తదుపరి, గ్రామ ప్రజలచేత సమస్యలపై నివేదికలు స్వీకరించిన తీగల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ —
“ప్రతి విషయంలోనూ గ్రామ ప్రజలకు అండగా ఉంటాను. ప్రజా సమస్యల పరిష్కారంపై గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహించకూడదు. పనుల పురోగతిపై ప్రతిరోజూ నాకు నివేదిక అందించాలి,” అని హెచ్చరించారు. అలాగే, “ప్రజల ఇబ్బందులను దగ్గరగా తెలుసుకోవడం కోసం ప్రతిరోజూ ప్రతి వార్డులో స్వయంగా పర్యటిస్తాను. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుంది,” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.