కోరికలు తీర్చే కల్పవల్లి – అడెల్లి మహా పోచమ్మ తల్లి
భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం – కార్తీక మాసంలో మహా పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 09
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని పవిత్రమైన అడెల్లి గ్రామం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల మనసుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించిన మహా పోచమ్మ తల్లి పునఃప్రతిష్టాపన అనంతరం భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కార్తీక మాసంలో నూ
తన ఆలయంలో జరిగిన ఈ పునఃప్రతిష్టాపన తర్వాత మొదటి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. భక్తులు ఈ రోజు దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నారు. పండితుల ప్రకారం, ఒకప్పుడు కరువు సంభవించగా ప్రజల ప్రార్థనలతో శివుడు తన కుమార్తె పోచమ్మను ఇక్కడికి పంపగా, ఆమె కరువును నివారించి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అప్పటి నుండి అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ అడెల్లిలోనే కొలువుదీరారు. శివపార్వతుల ఏడుగురు కుమార్తెలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలు ఈ ఆలయ గర్భగుడిలో కొలువుదీరడం ఈ ఆలయానికి ప్రత్యేకతను ఇస్తుంది. పండితులు చెబుతున్న ప్రకారం, ఇలాంటి గర్భగుడి దేశంలో మరెక్కడా లేదని విశేషం. అలాగే, పరశురాముడు ఈ ప్రాంతంలో పర్యటించి తల్లి గద్దెను ఏర్పాటు చేశాడని పురాణాల సూచన. రోజురోజుకూ అమ్మవారి భక్తుల విశ్వాసం పెరుగుతూ, అడెల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శక్తితో పులకించిపోతుంది.