ఆలస్యంగా వెలుగులోకి… వీధి కుక్కలతో భయాందోళనలో గ్రామస్తులు
బిఆర్ఎస్ నేతకు తీవ్ర గాయాలు
— “కుక్క కాటులేని బాధితులు లేరు, కుక్క కాటులేని కాలనీ లేదు”
మనోరంజని తెలుగు టైమ్స్, బాసర ప్రతినిధి – నవంబర్ 08:
నిర్మల్ జిల్లా బాసర మండలంలో వీధి కుక్కల ఉచ్చాటన లేకపోవడంతో గ్రామ ప్రజలు భయంతో వణుకుతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఇళ్ల ముందు కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు. గత మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన సికిందర్ కుమార్తెపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించింది. ఆ ఘటన మరవకముందే నిన్న రాత్రి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోర్వ శ్యామ్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా బస్టాండ్ సమీపంలో సుమారు పది కుక్కలు అడ్డుపడడంతో బైక్ కిందపడిపోయి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామస్థులు మాట్లాడుతూ — “రోజుకో వ్యక్తి కుక్క కాటుకు గురవుతున్నారు. కుక్క కాటులేని బాధితులు లేరు, కుక్క కాటులేని కాలనీ లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడదను తక్షణమే నియంత్రించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు వి.డి.సి. సభ్యులు, స్థానిక అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.