కార్తీక పౌర్ణమి భక్తి శోభలో నిజామాబాద్ నగరం
తులసి పూజలో మహిళలు, యువకుడి విశేష పాల్గొనడం ఆకర్షణ
మనోరంజని తెలుగు టైమ్స్ | నిజామాబాద్ ప్రతినిధి | నవంబర్ 05
కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలో భక్తి వాతావరణం అలముకుంది. ఉదయం నుంచే మహిళా మణులు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై, తులసి పూజకు ప్రత్యేక ధూప, దీప, నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. తులసి మొక్కను అలంకరించి తులసి లగ్గం చేయడం భక్తి భావంతో సాగింది. ఈ కార్యక్రమంలో ఒక విశేషం చోటు చేసుకుంది. ఓ యువకుడు నాగ సాయి తులసి పూజ నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అతని తల్లి మాల్వేకర్ ప్రభావతి శ్రీవారి సన్నిధిలో వారం రోజులుగా సేవా కార్యక్రమంలో పాల్గొంటుండటంతో, ఆమె స్థానంలో కుమారుడు నాగ సాయి పూజ నిర్వహించాడు. ఆయన భక్తి, వినయంతో చేసిన పూజ అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాల్గొన్న యువతి సంగీత మాట్లాడుతూ —
“కార్తీక పౌర్ణమి అంటే దీపాలు వెలిగించడం మాత్రమే కాదు. అజ్ఞాన చీకటిని తరిమి, జ్ఞాన వెలుగును పెంపొందించుకోవడం ఈ పండుగ అసలు సందేశం. వెలుగు పంచే జీవన మార్గం చూపించేదే ఈ పవిత్ర రోజు” అని తెలిపింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తులసి పూజతో నిజామాబాద్ నగరం భక్తి, సాంప్రదాయ శోభతో నిండిపోయింది.