బయోమెట్రిక్ విధానంతో రైతులకు ఇబ్బందులు
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్ సిద్ధికి
బైంసా మనోరంజని ప్రతినిధి నవంబర్ 3
సోయా కొనుగోలులో మార్క్ఫెడ్ బయోమెట్రిక్ విధానం తేవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్ సిద్ధికి అన్నారు. సోమవారం బైంసా పట్టణంలో కలెక్టర్ అభిలాష అభినవ్కు ఆయన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన సోయా పంట విక్రయించడానికి టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు తీసుకోనున్నారు. అయితే రైతులు కొందరు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా వెళ్లడంతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. అటువంటివారు బయోమెట్రిక్ ఇవ్వకపోవడంతో ధాన్యం విక్రయించే సమయంలో ఇబ్బందులు తప్పవన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు పంట సాగు చేయడంతో విక్రయించడం ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఓటీపీ విధానం లేదా ఇతర విధానం అమలు చేసి రైతులు ధాన్యం విక్రయించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.