కమ్మర్పల్లి మండలంలోని కొందరు అధికారులకు ఇంకా తొలగని ఎన్నికల కోడ్
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఎత్తివేసినా కమ్మర్పల్లిలో మాత్రం ఇంకా కొనసాగుతున్న ప్రభావం
విగ్రహాలపై కప్పిన బట్టలు, మూసిన శిలాఫలకాలు యథాతథంగా
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల విమర్శలు
మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి నవంబర్ 01
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత నెల అక్టోబర్ 9న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు స్టే ఇచ్చి, ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లు ప్రకటించింది. అయినప్పటికీ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కొందరు అధికారులకు మాత్రం ఆ ఆదేశాలు ఇంకా తెలియనట్లుంది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కొన్ని విగ్రహాలకు బట్టలు కట్టి, శిలాఫలకాలను మూసివేశారు. కానీ కోడ్ ముగిసిన తర్వాత కూడా ఆ బట్టలు తొలగించకపోవడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. మండల కేంద్రంలోని ఒక ప్రముఖ విగ్రహానికి కట్టిన బట్టను గమనించిన స్థానిక విలేకరి ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే బట్ట తొలగించారు. అయితే, ఇతర గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ విగ్రహాలు కప్పబడినట్లుగానే ఉన్నాయి. స్థానికులు మాట్లాడుతూ, “ఎన్నికల కోడ్ ఎత్తివేసి ఇన్ని రోజులు అయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇప్పటికైనా అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచనలు ఇచ్చి విగ్రహాలపై కప్పిన బట్టలు తొలగించాలి” అని ప్రజలు కోరుతున్నారు.