స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు సైబర్ మేధ-ఏఐ అవగాహన శిక్షణ
సైబర్ నేరాలపై అప్రమత్తత – ప్రజల్లో అవగాహన కల్పించాలని డీసీపీ మధు శేఖర్ స్వామి సూచన
మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి ( గుర్రం నరేష్ ) నవంబర్ 01
హైదరాబాద్ సమీపంలోని **మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పిటిసి)**లో గురువారం స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు “సైబర్ మేధ-ఏఐ–2025” పేరిట ఒక రోజు అవగాహన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీపీ మధు శేఖర్ స్వామి ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అత్యాధునిక సాంకేతికతను, ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో స్వచ్ఛంద సంస్థలు, కళాశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు ముందుండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వారు 1930 టోల్ ఫ్రీ నంబరుకు వెంటనే ఫిర్యాదు చేయాలని, “డిజిటల్ అరెస్ట్” అనే పేరుతో వచ్చే కాల్స్ మోసపూరితమని హెచ్చరించారు. ఇంపాక్ట్ సంస్థకు చెందిన 652 మంది సభ్యులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. సైబర్ నేరాల తీరుతెన్నులు, వాటి నిరోధక చర్యలు, బాధితులను ఎలా రక్షించాలో శిక్షణలో వివరించారు.
2023–24లో దేశవ్యాప్తంగా రూ. 23 వేల కోట్లు సైబర్ నేరాల్లో దోచుకున్నారని నివేదికలు వెల్లడిస్తున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రైనర్లు “గోల్డెన్ అవర్స్” (బంగారు గంటలు)లో తక్షణ చర్య తీసుకోవడం ఎంత ముఖ్యమో వివరిస్తూ, పరిచయం లేని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఇవ్వడం ప్రమాదకరమని ఉదాహరణలతో వివరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసకొత్తూరు గ్రామానికి చెందిన ఉట్నూరి నరేష్ డీసీపీ మధు శేఖర్ స్వామి చేతుల మీదుగా సర్టిఫికేట్ అందుకున్నారు.