పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహణ : జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్
రక్తదానం మనిషి చేయగల అత్యుత్తమ సేవ — జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్
మనోరంజని తెలుగు టైమ్స్ మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి – అక్టోబర్ 24
మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “రక్తదానం చేయడం అత్యంత మహత్తరమైన సేవ. ఒక్క యూనిట్ రక్తంతో ముగ్గురు ప్రాణాలను రక్షించగలమనే సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంలో ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా సమాజానికి సేవ చేయడమే కాకుండా అమరవీరుల త్యాగాలను స్మరించడమన్నది కూడా మన బాధ్యత” అని అన్నారు.
అలాగే, పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలందరూ తరచూ రక్తదానం చేయాలని, అది మనిషి చేయగల అత్యుత్తమ సేవలలో ఒకటని ఎస్పీ డి. జానకి పిలుపునిచ్చారు.