నిర్మల్లో భూ కబ్జాదారులపై ఉక్కుపాదం – దివ్యనగర్లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం
అయ్యప్ప ఆలయం ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతతో కలకలం
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – నిర్మల్, అక్టోబర్ 17
ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన భూ కబ్జాదారులపై నిర్మల్ జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. పట్టణంలోని అత్యంత విలువైన ప్రాంతమైన దివ్యనగర్లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.
వివరాల్లోకి వెళ్తే—దివ్యనగర్లోని అయ్యప్ప ఆలయం ముందు సర్వే నంబర్ 534లో గల ప్రభుత్వ భూమిని కొందరు భూ కబ్జాదారులు రాత్రికి రాత్రే ఆక్రమించి నిర్మాణాలు ప్రారంభించారు. ఈ విషయం రెవెన్యూ, మున్సిపల్ అధికారుల దృష్టికి రావడంతో, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కూల్చివేత ఆపరేషన్ చేపట్టారు. తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కోట్ల రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు.
భూ కబ్జాదారులకు అధికారులు హెచ్చరిక ప్రభుత్వ భూములపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిని ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ఇకపై ఇలాంటి కబ్జాలకు తావు ఇవ్వబోమని హెచ్చరించారు. నిర్మల్ పట్టణంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరుగుతున్న నేపథ్యంలో, అధికారుల ఈ ఆకస్మిక చర్యతో కబ్జాదారుల్లో కలకలం మొదలైంది.