భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్లు
రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 15
ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ముధోల్- బాసర- కుబీర్ -బైంసా- లోకేశ్వరం- కుంటాల మండలాల్లోని ఆయా గ్రామాలకు ప్రధాన రహదారుల నుండి వెళ్లే రోడ్లు గుంతల మయంగా మారాయి. దీంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు, గ్రామీణులు నానా అవస్థలకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లడానికి వాహనదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతం. లోలెవల్ వంతెనల వద్ద రోడ్లు కోతకు గురికావడంతో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా రోడ్లపై ఏర్పడ్డ పెద్దపెద్ద గుంతలతో ప్రమాదాలు సైతం జరిగాయి. ప్రధాన రహదారుల నుండి గ్రామాలకు వెళ్లి రోడ్లపై గుంతలు ఏర్పడడంతో ప్రయాణం కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. సరిహద్దు గ్రామాల్లోని రోడ్లు సైతం దెబ్బతిన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో వానదారులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రోడ్లు కోతకు గురైన విషయాన్ని రాత్రి సమయాల్లో గమనించక వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. గ్రామాల్లో పంట కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. తమ పంటలను విక్రయించడానికి వాహనాల్లో తీసుకెళ్తున్న సమయంలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై గుంతలను చూసి పంటలను విక్రయ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు వాహనదారులు రావడంలేదని పేర్కొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లకు సకాలంలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.