కుబీర్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకంపై ఆందోళన
మనోరంజని తెలుగు టైమ్స్ కుబీర్ ప్రతినిధి అక్టోబర్ 15
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకాలు తక్షణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. నాయకులు ఆహాద్ సాహిల్, అబ్దుల్ వాహెద్, జావిద్ ఖాన్ లు మాట్లాడుతూ, 2016 నుండి ఆంగ్లం, గణితం, భౌతిక శాస్త్ర బోధకులు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తుండగా బోధకులు లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు.వారు పేర్కొన్నట్లుగా, 2022లో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తెలుగు మీడియం ఉపాధ్యాయుని ఉర్దూ పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపినా, ఆయన విధులకు హాజరు కావడం లేదని తెలిపారు. ప్రధాన బోధన అంశాలు లేకపోవడం వల్ల విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే ఆసక్తి కోల్పోతున్నారని అన్నారు. వారం రోజుల్లో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకపోతే విద్యార్థులతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ బారి, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.