సైబర్ నేరాలపై పాఠశాలల్లో చైతన్య స్ఫూర్తి నింపిన నారిశక్తి
ప్రభావవంతంగా కొనసాగిన నారిశక్తి కార్యక్రమం
బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 15
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల నాయకత్వంలో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా నారిశక్తి కార్యక్రమం మరింత ప్రభావవంతంగా కొనసాగింది. నిర్మల్ పోలీస్ శాఖ చేపడుతున్న ప్రతి బుధవారం నారిశక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీస్ సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో పెట్రోలింగ్ డ్యూటీ తో పాటు వచ్చిన డయల్ 100 కాల్స్‌కు తక్షణమే స్పందించి బాధితుల సమస్యలను పరిష్కరించారు. వీటితో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి గ్రామాల్లో ఉన్న పాఠశాలలను సందర్శించి పిల్లలకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. ప్రజలకు ట్రాఫిక్ నియమాలు, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల సంభవించే ప్రమాదాల గురించి వివరించారు. విలేజ్ పోలీసింగ్ లో భాగంగా మహిళా సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ పరిధి లోని ప్రతీ గ్రామాల్లో తిరుగుతూ కల్తీ కల్లు, గంజాయి వాడకం, అక్రమ రవాణా పై ప్రజలకు చైతన్యం కల్పించారు. అనంతరం నారిశక్తులు వాహన తనిఖీలు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. నారి శక్తి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల మహిళా సిబ్బంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.