నిబంధనలకు నీళ్లు… జోరుగా మినరల్ వాటర్ వ్యాపారం
M4News ప్రతినిధి – సారంగాపూర్, అక్టోబర్ 9
ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని కొందరు నీటి దందాకు శ్రీకారం చుట్టారు. సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు వర్షం తర్వాత పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి.
ప్రజల ఆరోగ్యం పేరుతో ప్యూరిఫైడ్ వాటర్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్లాంట్లు వాస్తవానికి నిబంధనలను గాలికొదిలేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాణ్యతలేని బోరు నీటిని స్వల్ప రసాయనాలతో కలిపి ప్యూరిఫైడ్ నీటిగా విక్రయిస్తున్నారు.
🔹 బీఐఎస్ నిబంధనలకు తూట్లు
ఒక నాణ్యమైన ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రూ.30 నుండి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ, చాలా ప్లాంట్లు కేవలం రూ.2 లక్షల యంత్రాలతో, రేకుల షెడ్డు కిందే ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పదిసార్లు చేయాల్సిన శుద్ధి ప్రక్రియను రెండు సార్లకే పరిమితం చేసి, రసాయన మిశ్రమాలతో నీరు సరఫరా చేస్తున్నారు.
🔹 కలుషిత డబ్బాలు – ప్రమాదకర నీరు
నీటి డబ్బాలను సరిగా కడగకుండానే ఆటో ట్రాలీల్లో నింపి హోటళ్లకు, దుకాణాలకు పంపుతున్నారు. ఫలితంగా ఆ నీటిలో సూక్ష్మజీవులు పెరుగుతుండగా, ప్రజలు ఆ నీటిని తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. వైద్య నిపుణుల ప్రకారం, రసాయనాలు అధిక మోతాదులో కలపడం వల్ల మోకాళ్ల నొప్పులు, జీర్ణవ్యవస్థ సమస్యలు, శరీర తేమ తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
🔹 అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
నిబంధనలు పాటించకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రమాణాలను ఉల్లంఘించిన ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
🔹 అనారోగ్యాలకు మూలం
తాగునీరు శుద్ధంగా లేకపోవడం అనారోగ్యాలకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఫంగస్, ఈ-కోలి, కోలీఫార్మ్ వంటి బ్యాక్టీరియా కలుషిత నీటిలో ఉండటం వల్ల టైఫాయిడ్, అతిసారం, గొంతు ఇన్ఫెక్షన్, కడుపు మంట వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి, అనుమతులు లేకుండా నడుస్తున్న ప్లాంట్లను మూసివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.