ముధోల్ లో సోయా పంట నూర్పిడికి వర్షం దెబ్బ
ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 5
ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన సోయా పంట నూర్పిడి పనులకు వర్షం దెబ్బ కొట్టింది. ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోయా పంట దెబ్బతిన్నది. అయితే నాలుగైదు రోజుల నుండి వర్షాలు లేకపోవడంతో ఉన్న కాస్త సోయా పంట నూర్పిడి పనులు రైతులు ముమ్మరంగా చేపట్టారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి సోయా పంట కోత పనులు నిలిచిపోవడంతో పాటు నూరుపిడి చేసిన పంట తడిసిపోయింది. వర్షాలు తగ్గుముఖం పట్టి పంట కోతలు ప్రారంభం అవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా వర్షాలు కురిసి పంటలు తడవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోయా పంటకు ప్రైవేటులో నాలుగువేల లోపే క్వింటాలకు ధర పలకడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోయా పంట కోతలు కోసి గింజలను రోడ్డుపై ఆరబెట్టిన సమయంలోనే వర్షం రావడంతో తడిసిపోయినట్లు రైతులు తెలిపారు. పంటను తడవకుండా టార్పాలిన్ లను కప్పి అక్కడే రైతులు పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే పంటలు ఇంటికి వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా సోయా పంట రంగు మారుతే సైతం ధర తక్కువగా వస్తుందని రైతులు పేర్కొన్నారు. దాదాపు సగం వరకు పంట కోతలు పూర్తి అయ్యాయని మిగతా వాటి కోత పనులు పూర్తయితే కనీసం చేతు ఖర్చులకైనా డబ్బులు వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. వరుణ దేవుడు కరుణిస్తేనే ఉన్న కాస్త పంటలు చేతికి వస్తాయని లేకుంటే పూర్తిగా నష్టపోవడం ఖాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వము ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఉన్న కాస్త పంటకు మద్దతు ధర లభిస్తుందని రైతులు పేర్కొంటున్నారు.