నిజామాబాద్ పోలీస్ కళాబృందం — ప్రజల్లో చైతన్యం, యువతలో మార్పు
M4News – నిజామాబాద్ | అక్టోబర్ 5, 2025
సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కళాబృందం నిరంతరం అవగాహణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
మార్చ్ నుండి సెప్టెంబర్ 2025 వరకు మొత్తం 117 అవగాహణ కార్యక్రమాలు నిర్వహించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్‌ల పరిధిలోని గ్రామాల్లో కళాబృందం సభ్యులు పాటలు, నాటకాల రూపంలో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మాదకద్రవ్యాల ముప్పు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, మహిళల రక్షణ చట్టాలు, కల్తీ మద్యం వినియోగం ప్రమాదాలు, సీసీ కెమెరాల సంరక్షణ, షీటీమ్ సేవలు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహణ కల్పిస్తున్నారు.
కళాబృందం ప్రధానంగా “నేరాలు జరిగాక కాకుండా, అవి జరగకుండా ముందే ప్రజల్లో చైతన్యం కలిగించడం” అనే ధ్యేయంతో పనిచేస్తోంది.
ఈ కళాబృందానికి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) శ్రీనివాస్ ఇన్‌చార్జ్‌గా ఉంటూ, ఏఆర్‌ఎస్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు శేఖర్, విక్రమ్, మహిళా హోంగార్డు సీత, అవుట్‌సోర్స్ బాలరాజ్ తదితరులు పాల్గొంటున్నారు.
ప్రతి గ్రామంలో మంచి స్పందన లభిస్తోందని, ప్రజలలో సామాజిక బాధ్యత, చట్టాలపై అవగాహణ పెరుగుతోందని కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. కళాబృందం పర్యటనల వలన గ్రామాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.