‘Shakti’ Warning: ‘శక్తి’ తుపాను: అక్టోబర్ 7 వరకు భారీ వర్షాలు. IMD హెచ్చరిక..!!
ముంబై, అక్టోబర్ 4 : ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు ఎక్కడా ఆగడం లేదు. విపరీత వర్షాలు ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయో అనేంతలా ఉంది పరిస్థితి. భారత వాతావరణ శాఖ (IMD) ‘శక్తి’వంతమైన తుపాను గురించి సమాచారం అందించింది.
దీనికి ‘శక్తి’ అని నామకరణం చేసి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు’శక్తి’ తుఫాను ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ తుఫాను ప్రభావంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నేటి (అక్టోబర్ 4) నుంచి 7 వరకు కుండపోత వర్షాలుంటాయని తెలిపింది.
ఈ తుపాను.. ఉత్తర తూర్పు అరేబియన్ సముద్రంలో ఏర్పడింది. ద్వారకకు 240 కి.మీ. దూరంలో దీని కేంద్రం ఉంది. ఇది తీవ్రమైన సైక్లోనిక్ స్టార్మ్‌గా మారే అవకాశం ఉంది. దీంతో గంటకు 45 కి.మీ. నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు, ఇవి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని కూడా వెల్లడించింది.
ఉత్తర మహారాష్ట్ర తీరప్రాంతాల్లో సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంటుందని అక్టోబర్ 5 వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించింది. ఫలితంగా ముంబై, థానే, పల్ఘర్, రాయ్‌గఢ్, రత్నాగిరి, సింధుదుర్గ్ వంటి తీరప్రాంత జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని తెలిపింది. ఇక, అంతర్గత ప్రాంతాలైన ఈస్ట్ విదర్భ, మరాఠవాడా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నార్త్ కొంకణ్‌లోని కొన్ని ప్రదేశాల్లో వరదలు కూడా రావచ్చని పేర్కొంది.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను యాక్టివేట్ చేయాలని, తీరప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో ఎవాక్యుయేషన్ ప్లాన్‌లు రూపొందించాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం సూచించింది.
తుపాను సమయంలో ప్రజలు సముద్రంలోకి వెళ్లకుండదని, భారీ వర్షాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు 6వ తేదీ వరకు అరేబియా సముద్రంలోకి వెళ్లకూడదని IMD స్పష్టం చేసింది. ఈ తుఫాను ప్రధానంగా ఆఫ్‌షోర్(సముద్రం)లోనే ఉంటుందని, కానీ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరాలపై కూడా ప్రభావం చూపిస్తుందని వెల్లడించింది