Good News: పండగ పూట రైతులకు మరో శుభవార్త..
స్థిరమైన వ్యవసాయం వైపు దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వ రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) భారతీయ రైతులకు తీపి కబురు చెప్పింది.
పంట దిగుబడిని పెంచడంతో పాటు మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా తదుపరి తరం బయో-స్టిమ్యులెంట్ ‘ధర్అమృత్’ (DharAmrut)ను ప్రారంభించింది. గుజరాత్‌లోని గాంధీ నగర్ లో ఈవాళ జరిగిన కార్యకర్యమంలో ఈ ప్రొడక్ట్ ను ఇఫ్కో లాంచ్ చేసింది. గుజరాత్ వ్యవసాయ మంత్రి రాఘవ్ భాయ్ పటేల్, ఎంపీ పురుషోత్తం రూపాలా, ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పంట దిగుబడి గణనీయంగా పెరగడం, మొక్కల ఆరోగ్యం మెరుగుపడటంలో ఈ ఉత్పత్తి కీలకపాత్ర పోషించనుంది. అమినో ఆమ్లాలు, అల్జినిక్ ఆమ్లం, కార్బన్, ముఖ్యమైన ట్రేస్ మినరల్స్‌తో అధునాతన కొలాయిడల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఉపయోగించి ఈ ధర్ అమృత్ ను అభివృద్ధి చేశారు. మొక్కల జీవక్రియను నియంత్రించి కణ నిర్మాణాలను బలపరచనుంది. దీని వినియోగించడం ద్వారా పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుందని ఇఫ్కో తెలిపింది. కాగా ఇఫ్కో ఇప్పటికే ద్రవ రూపంలో నానో యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే