సా.5 గంటకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం !
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. జీఎస్టీ రేషనలైజేషన్ అమల్లోకి రానున్న తరుణంలో ఈ అంశంపై ప్రధాని మోదీ ప్రజలకు మరింత వివరించే అవకాశం ఉంది. సోమవారం నుంచి 5, 18 అనే రెండు శ్లాబులు మాత్రమే అమల్లోకి రానున్నాయి. దీని వల్ల ప్రత్యక్ష పన్నుల్లో ప్రజలకు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పటికే ఆదాయపు పన్ను కట్టే వారికి భారీ ఊరట కల్పించారు.
పెట్రోల్, డీజిల్ విషయంలోనూ ప్రధాని మోదీ ఎంతో కొంత ఊరట కల్పించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. జీఎస్టీ ఊరటతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు కల్పించే కొన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది పండుగ సీజన్ కావడంతో ప్రజలకు సంతోషకరమైన వార్తలే ప్రకటించే అవకాశం ఉంది. అలాగే అమెరికా .. మన దేశం పట్ల వ్యవహరిస్తున్న అంశంపైనా స్పందించే అవకాశాలు ఉన్నాయి. వోకల్ ఫర్ లోకల్ నినాదానికి.. మన దేశాన్నే టెక్ హబ్‌గా మార్చుకుందామని పిలుపునిచ్చే అవకాశం ఉంది.
జాతిని ఉద్దేశించి మోదీ చేసే ప్రసంగాలు అత్యంత ఆసక్తిని రేకెత్తించడానికి కారణాలు ఉన్నాయి. అత్యంత కీలకమైన సందర్భాల్లో ప్రకటనలు చేయడానికే ఆయన ఇలా ప్రసంగిస్తారు. గతంలో నోట్ల రద్దు సమయంలో ఇలా చేసిన ప్రసంగం సంచలనం సృష్టించడంతో అప్పటి నుంచి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారంటే.. ప్రజలంతా ఆసక్తి గా ఎదురుచూడటం ప్రారంభించారు