ముధోల్ లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం
బందోబస్తు పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల
గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 3
మండల కేంద్రమైన ముధోల్లో వినాయక నిమజ్జనం ఉత్సవాలు మంగళవారం సాయంత్రం ప్రారంభమై బుధవారం ఉదయం వరకు కొనసాగింది. వివిధ వార్డులలో ప్రతిష్టించిన వినాయకుడికి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రతిష్టించి భాజా భజంత్రీల మధ్య మంగళ హారతులతో స్వాగతం పలికి నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు, చిన్నారులు ఆధ్యాత్మిక పాటలపై చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సౌండ్ సిస్టం ల ముందు యువకులు నృత్యాలు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో బందోబస్తును పర్యవేక్షించారు. ప్రధాన వీధుల్లో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ జి. మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సిస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బందోబస్తు పర్యవేక్షిస్తూ శోభాయాత్ర సజావుగా సాగే విధంగా కృషి చేశారు. సర్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో సామూహిక డోల్ వాయిద్య నృత్యాలు శోభాయాత్రకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ కుటుంబంతో కలిసి శోభాయాత్రలో పాల్గొని విఘ్నేశ్వరునికి వీడుకోలు పలికారు. పంచాయతీ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో భక్తులకు త్రాగునీళ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్రేన్ ను విగ్రహాల నిమజ్జనం కొరకు నిమజ్జన స్థలం వద్ద అందుబాటులో ఉంచారు. అదేవిధంగా గజ ఈతగాళ్లు సైతం అందుబాటులో ఉన్నారు. గ్రామంలో ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. ముధోల్ హిందు ఉత్సవ సమితి-బిడిసి ఆధ్వర్యంలో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాలుగా కృషి చేశారు. పోలీస్ శాఖ, గ్రామపంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులకు ఉత్సవ సమితి, బిడిసి ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు.