పల్లెల్లో ఎన్నికల సందడి !
ఆశావహుల సందడి
సమరానికి సిద్ధమవుతున్న పార్టీలు
పోటీ చేసేందుకు ఆశావహుల ఏర్పాట్లు
నేడు జీపీ ఓటర్ల తుది జాబితా ప్రకటన
10న పరిషత్ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
గ్రామాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. నిన్నామొన్నటి వరకు పంచాయతీ, పరిషత్ ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేక ఆశావహులు స్తబ్దుగా ఉన్నారు. ఇంతలోనే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గ్రామపంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను మంగళవారం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తుది ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాను 10వ తేదీన ప్రకటించనున్నారు. ఇలా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమవుతండగా.. పోటీకి సై అంటున్న ఆశావహులు సైతం అన్ని అంశాలను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్
గ్రామపంచాయతీ పాలక వర్గాలతోపాటు జిల్లా, మండల పరిషత్‌ల గడువు ముగిసి ఏడాది పూర్తయింది. అప్పటి నుంచి సాంకేతిక చిక్కుముడులతో ఎన్నికల నిర్వహణలో ఆలస్యం జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించింది. కానీ గవర్నర్ ఆమోదం లేక సందేహాలు వ్యక్తమైనా అసెంబ్లీలో పురపాలికలు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆమోదించారు. ఇదే సమయాన ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో జీపీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లయింది.
లెక్క తేలనున్న ఓటర్లు
గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా మంగళవారం విడుదల కానుంది. ఇక 6వతేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్లు, పోలింగ్‌కేంద్రాల ముసాయిదా విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం 10న తుది జాబితాను విడుదల చేస్తారు. దీంతో తొలి అంకం ముగుస్తుంది.
పార్టీల్లో కదలిక
గ్రామపంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పటికప్పుడు ఆలస్యమవుతుండడంతో నేతలు పెద్దగా దృష్టి సారించలేదు. కానీ అధికార కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ అడపా దడపా సమావేశాలు నిర్వహించినా.. బీజేపీ, వామపక్ష పార్టీలు ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత అంతటా స్తబ్దత నెలకొంది. ఇంతలోనే ఎన్నికల అంశం తెరపైకి రాగా పార్టీల్లో కదలిక వచ్చింది. ప్రధానంగా కాంగ్రెస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం వ్యూహాలను రచిస్తోంది. ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఆర్‌ఎస్ సైతం ఇప్పుడిప్పుడే ఎన్నికలను ఎదుర్కొనే పనిలో పడింది.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతోందని తెలియగానే ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. కాంగ్రెస్‌లోని ఆశావహులు ఎక్కడి నుంచి పోటీ చేయాలి.. పరిషత్ ఎంచుకోవాలా, జీపీ ఎంచుకోవాలా అన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. కొందరు ఓటరు జాబితాల ఆధారంగా తమకు ఎక్కడ అనుకూలంగా ఓట్లు ఉన్నాయో సరి చూసుకుంటున్నారు. చాలా మంది గ్రామాల్లో పట్టుకోసం సర్పంచ్‌లుగా పోటీ చేయాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేయాలనుకునే వారు టికెట్ల కోసం నేతలు, మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పరిషత్ ఎన్నికలు సెప్టెంబర్‌లో, పంచాయతీ ఎన్నికలు అక్టోబర్‌లో జరుగుతాయనే ప్రచారం జరుగుతుండగా.. అటు అధికారులు, ఇటు ఆశావహులు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు