Election Commission : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల..!!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహకాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇందులో పురుష ఓటర్లు 2,04,288 మంది, మహిళా ఓటర్లు 1,88,356 మంది కాగా, మూడవ లింగానికి చెందిన వారు 25 మంది ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో 139 లొకేషన్లలో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు కోసం సెప్టెంబర్ 17 వరకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 25లోపు ఫిర్యాదులు, అర్జీల పరిష్కారం పూర్తిచేయనున్నారు. అనంతరం సెప్టెంబర్ 30, 2025న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా ఈ ఓటర్ల జాబితా అత్యంత కీలకంగా భావిస్తున్నారు