కన్నుల పండుగగా వినాయక నిమజ్జన శోభాయాత్ర
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాంప్రదాయ వాయిద్యాలు
ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 2
మండల కేంద్రమైన ముధోల్ లో మంగళవారం సాయంత్రం నుండి వినాయక నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. వివిధ గణేష్ మండలిల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విగ్నేశ్వరుడికి ఏడు రోజులపాటు శాస్త్రోక్తంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏడవ రోజు నిమజ్జనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామంలో ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. వినాయక నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర బందోబస్తు పరిశీలించి సిబ్బందికి సలహాలు ,సూచనలు ఇచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై లంబోదరుడని ప్రతిష్టించి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. లంబోదరుడికి వీడ్కోలు పలకడానికి మహిళలు మంగళహారతులతో తరలివచ్చారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ పంచాయతీ ఈఓ అన్వర్ అలీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిమజ్జనాన్ని పురస్కరించుకుని పారిశుధ్యంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిమజ్జన ఉత్సవాలను నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. సార్వజనిక్ గణేష్ మండలి వద్ద సాంప్రదాయ వాయిద్యాలతో నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏడు రోజులపాటు గ్రామంలో వివిధ మండలీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను సైతం నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. శోభాయాత్రను తిలకించడానికి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులతో ప్రజలు తరలివచ్చారు. ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సిఐ జి. మల్లేష్, స్థానిక ఎస్సై బిట్ల పెర్సిస్ ప్రత్యేకంగా బందోబస్తు పర్యవేక్షించారు. బందోబస్తులో దాదాపుగా 200 మంది పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం స్థానిక చెరువుతోపాటు పవిత్ర గోదావరి నదిలో వినాయకుడికి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు