*_స్థానిక పోరుకు వేళాయె_*
ఇప్పటికే జీపీల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తొలుతఇ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయని ప్రచారం ఎన్నికల సంఘం నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
*_ఎన్నికల సంఘం వైపు చూపు.._*
*_ఏడాదిగా ‘ప్రత్యేకమే’_*
గ్రామపంచాయతీ ఎన్నికలు 2019లో జరగగా, గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన పాలకవర్గాల గడువు ముగిసింది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అదే ఏడాది మే నెలలో నిర్వహిస్తే 2024 జూన్‌తో పాలకవర్గాల గడువు తీరింది. అప్పటి నుంచి గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. కానీ ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో పాలన కుంటుపడడం, నిధుల కూడా అంతంత మాత్రంగానే వస్తుండడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు.
*_అదిగో.. ఇదిగో అంటూ.._*
ఎప్పటికప్పుడు గ్రామపంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయంటూ హడావుడి చేయడం.. ఆపై మరుగున పడడం సాధారణమైంది. గత ఐదారు నెలలుగా నేడో, రేపో నోటిఫికేషన్ వస్తుందని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా సంకేతాలిచ్చారు. మాజీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన నియోజకవర్గాల వారీగా సమావేశాలు సైతం పూర్తిచేశారు. అయితే కులగణన, బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది తేలక ఆశావహులు కూడా స్తబ్దుగా ఉండిపోయారు.
*_కోర్టు తీర్పుతో మళ్లీ.._*
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సెప్టెంబర్ 30కల్లా స్థానిక సంస్థల్లో పాలకవర్గాలు కొలువుదీరాలని తీర్పు వెలువడింది. జిల్లాలోని 571 గ్రామపంచాయతీల్లో 5,214 వార్డులు, అంతేసంఖ్యలో పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం 3,146 బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలింగ్ రెండు విడతల్లో నిర్వహించే అవకాశం ఉండడంతో 2,607 బాక్స్‌లు సరిపోతాయి. మిగతావి రిజర్వ్‌గా భద్ర పరుస్త్తారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 1,572 పోలింగ్ కేంద్రాలను గుర్తించి, 3,150 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. అలాగే, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఎంపిక చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో 10,330 మంది అవసరమని ఇప్పటికే తేల్చారు.
*_వచ్చే నెలలో ఎన్నికల సందడి!_*
స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. హైదరాబాద్‌లో శనివారం సమావేశమైన కేబినెట్ స్థానిక ఎన్నికలకు ఆమోదం తెలుపుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈనెల 28న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయగా.. జిల్లా ఎన్నికల అధికారి, ఎంపీడీఓల ఆధ్వర్యాన పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. వార్డుల విభజనపైనా అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం వచ్చేనెల 2న ఓటర్ల తుదిజాబితా విడుదల కానుంది. ఎన్నికల సంఘం ప్రస్తుతం జీపీల వారీగా ఓటర్ల జాబితా విడుదల చేయడంతో తొలుత పంచాయతీ ఎన్నికలే జరుగుతాయని భావించారు. కానీ మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆతర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. మంత్రి మండలి లేఖ ఆధారంగా ఎన్నికల సంఘం ఏ ఎన్నికలకు, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.