మోదీ ఎందుకు ఇలా చేస్తున్నారో.. అమెరికా ఆర్థికవేత్త ఆశ్చర్యం
ట్రంప్ టారిఫ్ లు తగ్గించుకునే అవకాశం భారత్ చేతుల్లోనే ఉందన్న పీటర్ నవారో
రష్యా నుంచి చమురు కొనడం ఆపేసిన మరునాడే అదనపు సుంకాలు రద్దు
ఉక్రెయిన్ పై రష్యా దూకుడుకు పరోక్షంగా మోదీ ప్రోత్సహిస్తున్నారంటూ ఆక్షేపణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలను తగ్గించుకునే అవకాశం భారత్ కు ఇప్పటికీ ఉందని వైట్ హౌస్ సలహాదారు, ఆర్థిక వేత్త పీటర్ నవారో పేర్కొన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను ఆపేసిన మరుసటి రోజే అదనపు సుంకాలు రద్దు చేస్తామని చెప్పారు. ఇక దీనిపై నిర్ణయం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ పరిణతి చెందిన నాయకుడని కీర్తిస్తూనే ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో అంతుబట్టడం లేదని నవారో విమర్శించారు.
ఉక్రెయిన్ పై రష్యా దూకుడుకు పరోక్షంగా మోదీనే కారణమని ఆక్షేపించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే కారణమని, ఇది ‘మోదీ యుద్ధం’ అని నవారో ఆరోపించారు. భారత్‌పై అమెరికా విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ నవారో ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా నుంచి రాయితీపై భారత్ కొనుగోలు చేస్తున్న ముడి చమురు వల్ల ఉక్రెయిన్ పై దాడులు పెరుగుతున్నాయని పీటర్ నవారో చెప్పారు. ముడి చమురు అమ్మకాల ద్వారా సమకూరుతున్న డబ్బుతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెచ్చిపోతున్నారని, ఉక్రెయిన్ లో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలంటే భారత్ సహకరించాలని పీటర్ నవారో అభిప్రాయపడ్డారు