*జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న సీఎం రేవంత్: హరీష్ రావు*
హైదరాబాద్, ఆగస్టు 25: ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న ఆశ వర్కర్లకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పోలీసులు లేకుండా ఓయూకి వెళూ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని గుర్తు చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి .. ఓయూకి వస్తే విద్యార్థులు ఇయ్యర మయ్యర అందుకున్నారని వివరించారు. అప్పుడు సందులో పడి రేవంత్ రెడ్డి ఉరికాడని చెప్పారు. కానీ ఇప్పుడు.. తాను ఓయూకు వచ్చానని అంటున్నాడన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఓయూ సాక్షిగా క్షమాపణలు చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.
ఎప్పటి లోగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తావో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ఓయూకు వెళ్తున్నాడని గత మూడు రోజుల నుంచి విద్యార్థులను అరెస్టులు చేయించారని మండిపడ్డారు. వారిని పోలీసు స్టేషన్లలో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గజానికో పోలీసుని పెట్టారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓయూలో మంత్రి సబిత కొబ్బరికాయ కొట్టిన బిల్డింగ్‌ను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ వెళ్లారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్మించిన దానికి రేవంత్ రెడ్డి రిబ్బన్ కత్తిరించాడని ఎద్దేవా చేశారు. కత్తెర జేబుల పెట్టుకొని తిరుగుతున్నాడంటూ సీఎం రేవంత్ రెడ్డిని వ్యంగ్యంగా విమర్శించారు. హైదరాబాద్ ఫ్లైఓవర్లు కేసీఆర్ కట్టించినివేనని.. వాటికి రిబ్బన్ కట్ చేసేందుకే వెళ్తాడంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టినవి ఓపెన్ చేయడమే కానీ.. కొత్తగా ఒక్క దవాఖాన కూడా నిర్మించలేదన్నారు. ఒక బ్రిడ్జి కానీ.. ఒక బిల్డింగ్ కానీ కట్టలేదని మండిపడ్డారు.. KP