బుమ్రా ఆల్ టైమ్ రికార్డ్ సమం: ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్..!!
బ్రిటన్.. ది ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లాండ్‌లో జరిగిన ఒక టెస్ట్ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్‌గా రేర్ ఫీట్ నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉండేది. ఇంగ్లాండ్‌పై ఒక టెస్ట్ సిరీస్‌లో 23 వికెట్లు తీసి ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు బుమ్రా. తాజాగా జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరాజ్ బుమ్రా రికార్డును సమం చేశాడు సిరాజ్. ఈ సిరీస్‌లో 23 వికెట్లు పడగొట్టిన మియాబాయ్.. బుమ్రాతో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేసులో కొనసాగుతున్నాడు.
ఓవల్ టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన సిరాజ్ మరో ఘనత కూడా సాధించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో ఫైవ్ వికెట్ హల్ సాధించడం హైదరాబాదీ పేసర్‌కు ఇది ఐదోసారి. తద్వారా టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ రికార్డును సమం చేశాడు సిరాజ్. అక్షర్ పటేల్ కూడా డబ్ల్యూటీసీలో ఐదు సార్లు ఐదు వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత తరుఫున అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హల్ సాధించిన బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (12) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అశ్విన్ (11), రవీంద్ర జడేజా (6) జడేజా ఉన్నారు.
ఇక ఓవల్ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ 57 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిస్తే.. ఇంగ్లాండ్ పేసర్ అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 247 పరుగులకే పరిమితమైంది. సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ (118) సెంచరీతో కదం తొక్కడంతో ఇండియా 396 భారీ స్కోర్ చేసింది. టంగ్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 374 పరుగుల ఛేజింగ్‌లో ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటై 6 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఐదు మ్యాచుల సిరీస్ 2-2తో సమం అయ్యింది.
ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
23 – జస్ప్రీత్ బుమ్రా (2021-22, 9 ఇన్నింగ్స్)
23 – మహమ్మద్ సిరాజ్ (2025, 9 ఇన్నింగ్స్)
19 – భువనేశ్వర్ కుమార్ (2014, 7 ఇన్నింగ్స్)
18 – జహీర్ ఖాన్ (2007, 6 ఇన్నింగ్స్)
18 – ఇషాంత్ శర్మ (2018, 9 ఇన్నింగ్స్)
18 – మహమ్మద్ సిరాజ్ (2021-22, 9 ఇన్నింగ్స్